Amit Shah: రెండు గంటలకు పలాసకు అమిత్ షా.. బస్సు యాత్రను ప్రారంభించనున్న బీజేపీ చీఫ్

  • హెలికాప్టర్ ద్వారా పలాస చేరుకోనున్న అమిత్ షా
  • టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం 
  • పలాసలో ప్రారంభమై ఆదోనిలో ముగింపు
బీజేపీ చీఫ్ అమిత్ షా నేటి మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని పలాస చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం బీజేపీ బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ దారుణంగా మోసం చేసిందన్న టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టే లక్ష్యంతో ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా టీడీపీ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ‘సత్యమేవ జయతే’ పేరుతో చేపట్టిన ఈ యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారని పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు డాక్టర్ కె.విశ్వనాథం తెలిపారు.

బీజేపీ బస్సు యాత్ర 15 రోజులపాటు ఏపీలోని 85 నియోజకవర్గాల మీదుగా సాగనుంది. పలాసలో ప్రారంభమై కర్నూలు జిల్లా ఆదోనిలో ముగియనుంది. బస్సు యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో కేంద్రమంత్రులు పాల్గొని ప్రసంగించేలా ప్రణాళికలు రూపొందించారు.  రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి, కేంద్రం అందిస్తున్న సాయం గురించి ప్రజలకు వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్ర సాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
Amit Shah
BJP
Srikakulam District
Palasa
Bus tour

More Telugu News