panchayat polls: పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటేయలేదని ఓటరు ఇంటికి నిప్పుపెట్టిన అభ్యర్థి!

  • ఎన్నికలకు ముందు మద్దతు ఇస్తామని చెప్పి, ఓటేయని స్నేహితులు
  • ఐదు ఓట్ల తేడాతో ఓటమి పాలైన అభ్యర్థి
  • కోపంతో ఇల్లు, గడ్డివాముకు నిప్పు

తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఓ అభ్యర్థి తనకు ఓటు వేయలేదన్న దుగ్ధతో ఓటరు ఇంటికి నిప్పు పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురంలో జరిగింది. ఇటీవల ఏర్పడిన రాంపురం పంచాయతీకి ఎన్నికలు నిర్వహించారు.

గత నెల 30న జరిగిన ఎన్నికల్లో గ్రామానికి చెందిన ఇస్లావత్ క్రాంతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. గ్రామానికే చెందిన భద్రు, శంకర్‌లు అతడికి మద్దతు ఇస్తామని మాటిచ్చారు. తీరా పోలింగ్ రోజు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య ఇందిరపై ఐదు ఓట్ల తేడాతో ఇస్లావత్ క్రాంతి ఓడిపోయాడు.

తనకు మద్దతు ఇస్తానని చెప్పి టీఆర్ఎస్‌కు ఓటేయడం వల్లే తాను ఓడిపోయానంటూ అదే రోజు రాత్రి భద్రు, శంకర్‌ల ఇంటికి వెళ్లి క్రాంతి గొడవ చేసి దాడికి దిగాడు. అక్కడితో కోపం చల్లారని క్రాంతి ఈ నెల 2న రాత్రి భద్రు, శంకర్ నివాసానికి వెళ్లి, ఇల్లు, గడ్డివాము, కందికట్టలకు నిప్పు పెట్టాడు.

ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరూ అప్రమత్తమై వెంటనే మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

More Telugu News