Vijayashanthi: ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా... ఇప్పుడెందుకు నోరెత్తడం లేదు?: కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

  • ఫెడరల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం
  • మమతకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు?
  • అది ఫెడరల్ ఫ్రంట్ కిందికి రాదా?

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పదేపదే చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో నోరెత్తకపోవడం శోచనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు సీబీఐని కీలుబొమ్మగా ఉపయోగించుకుంటూ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తోందని మమత పదే పదే చెబుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రం ఒంటెత్తు పోకడలపై పోరాడుతున్న మమతకు ఎందుకు మద్దతివ్వడం లేదని కేసీఆర్‌ను నిలదీశారు.

పశ్చిమబెంగాల్‌లో ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీకి మద్దతుగా, కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వ్యవస్థల దుర్వినియోగం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ కిందికి రాదా? అని విజయశాంతి సూటిగా ప్రశ్నించారు. లేదంటే కొన్ని విషయాలను చూసీ చూడనట్టు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్‌లో  భాగమా? అని ఎద్దేవా చేశారు.  

More Telugu News