assembly: ఆకుల ఎందుకు రాజీనామా చేశారు...మేడా ఎందుకు నిష్క్రమించినట్టు?: అచ్చెన్న వెర్సస్‌ విష్ణుకుమార్‌రాజు

  • అసెంబ్లీ సాక్షిగా మంత్రుల మాటల యుద్ధం
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం రాజు ప్రస్తావన
  • ప్రత్యేక హోదాపైనా విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ బడ్జెట్‌ సమావేశాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు మధ్య తీవ్రవాగ్వివాదం చోటు చేసుకుంది. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.

వివరాల్లోకి వెళితే... రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల నిర్ణయాన్ని ఆమోదిస్తూ స్పీకర్‌ నేడు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

దీనిపై స్పందిస్తూ మీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెబితే ఆకుల గురించి నేనూ చెబుతానని విష్ణుకుమార్‌రాజు కౌంటర్‌ వేశారు. తన ప్రసంగాన్ని రాజు కొనసాగిస్తూ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని, పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కేంద్రం తీరుపై విమర్శలు కురిపించడంతో రాజు దీటుగా సమాధానం చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలుసునని, అందుకే వారి పార్టీ సభ్యులంతా నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరైనా ఆయన మాత్రం ధరించలేదని సెటైర్‌ విసిరారు.

ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్‌ తీసుకున్నారని, ఇప్పుడు పవన్‌ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నిన్నమొన్నటి వరకు జగన్‌, పవన్‌, బీజేపీ ఒకటేనని విమర్శించి, ఇప్పుడు లోపాయికారీగా పవన్‌ కల్యాణ్‌తో మళ్లీ సయోధ్యకోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News