Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఘోరం... ఫైర్ ఇంజన్ ఉందిగానీ, నీళ్లు లేవు!

  • తొలుత మహేష్ బ్యాంక్ స్టాల్ లో నిప్పులు
  • అక్కడికి సమీపంలోనే ఫైర్ ఇంజన్
  • ఖాళీ ఫైర్ ఇంజన్ ను నిలిపివుంచిన అధికారులు

హైదరాబాద్ లోని నాంపల్లి నుమాయిష్. జనవరి 1న ప్రారంభమై, ఫిబ్రవరి 15 వరకూ జరిగే ఎగ్జిబిషన్. ఈ 45 రోజుల్లో సుమారు 30 లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. నిన్న కూడా ఎగ్జిబిషన్ 3 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 7.30 గంటలకు మహేష్ బ్యాంక్ స్టాల్ లో ఏర్పాటు చేసిన ఏటీఎం సమీపంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ వెంటనే మంటలు లేచాయి.

ఆ వెంటనే నుమాయిష్, అజంతాగేట్ వద్ద నిలిపివున్న ఫైర్ ఇంజన్ కు సమాచారం అందింది. అయితే, వారు తమ పై అధికారులకు విషయం చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఎందుకంటే, వారివద్ద ఉన్న ఫైర్ ఇంజన్ లో నీరు లేదట. నీరు లేని ఫైర్ ఇంజన్ ను ఎగ్జిబిషన్ లోపల నిలిపివుంచారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

దానిలోనే నీరుండివుంటే, ఇంత పెద్ద ప్రమాదం జరిగివుండేది కాదని, కేవలం రెండు నిమిషాల్లో వచ్చి మంటలను ఆర్పివుండవచ్చని స్టాల్స్ నిర్వాహకులు అంటున్నారు. తమవద్ద నుంచి అద్దెలు, కరెంట్ బిల్లుల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటున్న నుమాయిష్ నిర్వాహకులు, ఇప్పుడు నష్టాన్ని భరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లో ఖాళీ ఫైర్ ఇంజన్ ను నిలిపివుంచడంపైనా విమర్శలు వస్తున్నాయి. 

More Telugu News