Andhra Pradesh: ఎన్నికల వలసలు.. వైసీపీలో చేరనున్న వర్ల రామయ్య సోదరుడు రత్నం!

  • త్వరలోనే వైఎస్ జగన్ తో భేటీ
  • రాజకీయ పదవులపై రాని క్లారిటీ
  • ఇప్పటికే టీడీపీకి మేడా గుడ్ బై

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి బావ రామకోటా రెడ్డి వైసీపీలో చేరగా, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి బావమరిది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే కాంగ్రెస్ కర్నూలు నేత, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో టీడీపీ నేత వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది.

టీడీపీ నేత, ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధమయింది. వైసీపీ అధినేత జగన్ తో త్వరలోనే వర్ల రత్నం భేటీ కానున్నట్లు సమాచారం. టీడీపీలో చాలాకాలంగా ఉన్న వర్ల రత్నం.. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

అయితే వర్ల రత్నం టీడీపీని ఎందుకు వీడాలనుకుంటున్నారు? ఆయనకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి హామీ లభించింది? అన్న విషయాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ వార్తలపై వర్ల రామయ్య కూడా స్పందించలేదు. టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను టీడీపీ బహిష్కరించింది.

More Telugu News