నా కోరిక తీర్చకుంటే పరీక్షల్లో పెయిల్ చేస్తా.. ఇంటర్ అమ్మాయికి లెక్చరర్ వేధింపులు!

28-01-2019 Mon 15:49
  • ఏపీలోని తూర్పుగోదావరిలో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితురాలు
  • పరారీలో ఉన్న లెక్చరర్ పితాని నూకరాజు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ అధ్యాపకుడు కామాంధుడిగా మారాడు. తన కోరికను తీర్చాలనీ, ఫోన్ లో చాటింగ్ చేయాలని ఓ ఇంటర్ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. లేదంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. చివరికి వేధింపులు హద్దు దాటడంతో సదరు యువతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని సామర్లకోటలో ఉన్న వైఎల్ఆర్ కాలేజీలో ఓ యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో అదే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న పితాని నూకరాజు అమ్మాయిపై కన్నేశాడు. తన కోరికను తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయి ఫోన్ కు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. తన మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఈ వేధింపులను తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యువతి ఫిర్యాదుతో సదరు కీచక లెక్చరర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయం ఎలాగో ముందుగానే తెలుసుకున్న పితాని నూకరాజు పరారయ్యాడు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.