Himachal Pradesh: డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలోకి.. చిరుత పులి పిల్లను చూసి పరుగో పరుగు!

  • దారి తప్పి గ్రామంలోకి వచ్చిన చిరుత పిల్ల
  • చలికి తట్టుకోలేక ఏటీఎంలోకి
  • పట్టుకుని అడవిలో వదిలేసిన అధికారులు

దారి తప్పి ఊర్లోకి వచ్చిన ఓ  చిరుతపులి పిల్ల చలికి తట్టుకోలేకపోయింది. అటూ ఇటూ చూసి ఎదురుగా కనిపించిన ఏటీఎం సెంటర్‌లోకి దూరింది. కాస్త వెచ్చగా ఉండడంతో అక్కడే సెటిలైపోయింది. అక్కడ అది ఉందని తెలియని ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లి దానిని చూసి హడలిపోయాడు. గుండెలు అరచేతితో పట్టుకుని భయంతో పరుగులు తీశాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా తుంగ్ ప్రాంతంలో ఆదివారం జరిగిందీ ఘటన.

సదరు వ్యక్తి కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో ఆరా తీసిన స్థానికులు ఏటీఎంకు చేరుకుని లోపలున్న చిరుత పిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి ఏటీఎం నుంచి దానిని బయటకు తీశాడు. అతడి చేతుల నుంచి తప్పించుకున్న అది అక్కడే ఉన్న ఓ వాహనం కిందికి వెళ్లి నక్కింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి దానిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. చిరుత పిల్ల ఏటీఎంలో దూరడంపై స్థానికులు మాట్లాడుతూ.. చలికి తట్టుకోలేకే అది అందులో దూరినట్టు చెప్పారు.

More Telugu News