సోనూసూద్ పాత్రను ముందుగానే చంపేయాలన్నారు.. ఒప్పుకోకపోవడంతో నన్ను తప్పించారు!: దర్శకుడు క్రిష్
- మణికర్ణిక సినిమాపై నోరు విప్పిన దర్శకుడు
- కంగన చరిత్ర వక్రీకరణకు యత్నించారని మండిపాటు
- సినిమా మొత్తం తానే తీశానని స్పష్టీకరణ
గత జూన్ కల్లా సినిమా దాదాపుగా పూర్తయిపోయిందని క్రిష్ తెలిపారు. అయితే కంగనా ఫస్టాఫ్ లో 20-25 శాతం, సెకండాఫ్ లో 10-15 శాతం సన్నివేశాలను రీషూట్ చేసిందన్నారు. కంగనా ‘మణికర్ణిక’ సినిమాలో చాలా మార్పులు సూచించారనీ, అందుకు తాను అంగీకరించానని అన్నారు. అయితే చివరికి ఈ సినిమాలో సోనూసూద్ నటిస్తున్న సదాశివరావ్ పాత్రను ఇంటర్వెల్ కు ముందుగానే చంపేయాల్సిందిగా కంగన కోరిందన్నారు. ఇది చరిత్రను వక్రీకరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి యుద్ధరంగంలో లక్ష్మీబాయి కంటే కొద్దిసేపటి ముందే సదాశివరావ్ మరణిస్తాడన్నారు.
ఈ విషయంలో తనకు, కంగనకు మధ్య వాగ్వాదం కాగా, నిర్మాత కమల్ ఆమె వైపే నిలబడ్డారని విమర్శించారు. సోనూసూద్ పాత్రను చంపేందుకు తాను అంగీకరించకపోవడంతో కంగనా మరొకరి సాయంతో సినిమాకు దర్శకత్వం వహిస్తుందని నిర్మాత కమల్ జైన్ చెప్పారన్నారు. తాను లేకుంటే సినిమాలో ఉండబోనని నటుడు సోనూ సూద్ స్పష్టం చేయడంతో మరో నటుడితో ఈ పాత్రను షూట్ చేశారన్నారు.