priyanka vadra: ఫిబ్రవరి 4 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ప్రియాంక వాద్రా

  • కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి అరంగేట్రం
  • అదే రోజు ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల స్వీకారం
  • వీలు కాకుంటే 10వ తేదీన...

నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఫిబ్రవరి నాలుగున రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. ఇటీవలే రాహుల్‌గాంధీ ఆమెను ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 4వ తేదీన కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం ఆచరించి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ వర్గాల సమాచారం.

ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ రోజు వీలుకాకుంటే 10వ తేదీన వసంత పంచమి సందర్భంగా కుంభమేళాకు వెళ్లి స్నానమాచరిస్తారని సమాచారం. దేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పట్టుసాధించేందుకు ప్రియాంక అస్త్రంలా పనిచేస్తుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తోంది.

హిందూ కార్డుతో ఓవైపు బీజేపీ దూసుకుపోతుంటే, హిందుత్వ భావనపై కాంగ్రెస్‌ మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శల నేపథ్యంలో కుంభమేళా సందర్భంగా ఈ భావనను చెరిపేసి హిందుత్వ ఎజెండా ఆవిష్కరించాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

More Telugu News