srinagar: రిపబ్లిక్ డే నాడు జమ్ముకశ్మీర్ లో గర్జించిన తుపాకులు

  • శ్రీనగర్ లో రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు
  • ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన భద్రతాబలగాలు
  • పుల్వామా, అనంతనాగ్ లలో కూడా ఉగ్రదాడులు

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ... పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కరులు అలజడి రేపేందుకు చేసిన యత్నాలను భారత బలగాలు తిప్పి కొట్టాయి. శ్రీనగర్ లో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు జైషే ముహమ్మద్ ఉగ్రవాదులు యత్నించారు. ఈ నేపథ్యంలో, శ్రీనగర్ శివార్లలోని ఖోన్మోహ్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. వారి నుంచి రెండు ఏకే 47 తుపాకులను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భారీ సంఖ్యలో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, శ్రీనగర్ సాయుధ పోలీసులు పాల్గొన్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు, ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డట్టు సమాచారం.

ఇదే సమయంలో పుల్వామాలో మరో ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు గ్రెనేడ్ ను విసిరారు. అయితే ఈ గ్రెనేడ్ క్యాంపు బయట ప్రాంతంలో పడి, పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అనంత్ నాగ్ పట్టణంలోని బస్ స్టాండ్ సమీపంలో పోలీస్ పోస్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.

More Telugu News