Hyderabad: ఇకపై బటన్‌ నొక్కి ఫిర్యాదు చేయొచ్చు...అందుబాటులోకి అత్యవసర సేవల యంత్రాలు!

  • ఎస్‌ఓఎస్ పేరిట అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానం
  • చురుకుగా సాగుతున్న కేబుల్ పనులు
  • సామాన్యులు సులువుగా కంప్లయింట్‌ చేసుకునే సదుపాయం

అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే నంబర్‌ తెలియదనో, ఎవరికి చెప్పాలో తెలియడం లేదనో ఇకపై చింతించక్కర్లేదు. ఎక్కడ ఉన్నా సమీపాన అందుబాటులో ఉన్న ఎస్‌ఓఎస్ పరికరం వద్దకు వెళ్లి దానికి ఉన్న బటన్‌ ప్రెస్‌ చేస్తే చాలు.. లైన్‌ కలుస్తుంది. మీ ఫిర్యాదును మీ భాషలోనే చెప్పొచ్చు. తక్షణ సాయం అందుతుంది. నిరక్షరాస్యులకు కూడా అక్కరకు వచ్చే ఈ సదుపాయం హైదరాబాద్‌ నగరంలో త్వరలో అందుబాటులోకి రానుంది.

 ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్‌ పార్క్‌ వద్ద వీటిని ఏర్పాటు చేశారు. జనం రద్దీ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు, సెన్సిటివ్‌ ప్రాంతాల్లో ఈ యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘అత్యవసర సేవలు’ పేరుతో అందుబాటులోకి తెస్తున్న ఈ సదుపాయం పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో భూగర్భ కేబుల్‌ పనులు చేపడుతున్నారు.

ఈ యంత్రం వద్దకు వెళ్లి బటన్‌ నొక్కి ఫిర్యాదు చేసిన వెంటనే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్తుంది. యంత్రానికి ఉన్న అతి సూక్ష్మ కెమెరా ద్వారా ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా కనిపిస్తారు. ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఈ వ్యవస్థను భాగ్యనగరం పోలీసులు  అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. పటిష్టమైన నిఘా, పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను అమర్చిన పోలీసులు, తాజా నిర్ణయంతో ప్రజలకు భద్రతాపరమైన చర్యలను మరింత చేరువ చేసినట్టవుతుంది.

ఏదైనా సంఘటన జరిగితే తక్షణం పోలీసు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకునేలా అవకాశం ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటుచేసే యంత్రాలతో మరింత ప్రయోజనం కలగనుంది.

More Telugu News