ISRO: ఇస్రో ఖాతాలో మరో విజయం.. పీఎస్ఎల్‌వీ-సి44 ప్రయోగం విజయవంతం

  • రెండు ఉప గ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్‌వీ
  • కలాంశాట్‌ను రూపొందించిన తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు
  • రక్షణ రంగ అవసరాలు తీర్చనున్న మైక్రోశాట్-ఆర్ 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి గురువారం అర్ధరాత్రి నిర్వహించిన పీఎస్ఎల్‌వీ-సి44 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన రాకెట్.. దేశ రక్షణశాఖ అవసరాల కోసం ఉద్దేశించిన 740 కిలోల మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహంతో పాటు, తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న 'కలాంశాట్'ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా సాగింది. సరిగ్గా గురువారం రాత్రి 11:37 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎవరైనా ఉపగ్రహాలు తయారు చేసుకుని తీసుకొచ్చి ఇస్రో నుంచి ప్రయోగించవచ్చని తెలిపారు. కలాంశాట్‌ను తయారుచేసిన తమిళనాడు విద్యార్థులను ఆయన అభినందించారు.
ISRO
SHAR
SDSC
Nellore District
satellite
Kalamsat
Abdul Kalam

More Telugu News