Kodandaram: ఈసీ రజత్ కుమార్ పై అందరికీ అనుమానాలున్నాయి: కోదండరాం

  • ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ సొంత పనులకు వాడుకుంటోంది
  • టీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ అధికారులు డబ్బులు పంచారు
  • ఈసీ రజత్ కుమార్ పై విచారణ జరిపించాలి

ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంత పనులకు వాడుకుంటోందని టీజేఎస్ అధినేత కోదండరాం విమర్శించారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రభుత్వ అధికారులే డబ్బులు పంచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారని... దీంతో, ఓటరు జాబితాను సవరిస్తామని ఎన్నికల సంఘం చెప్పిందని... అయినా అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు ఎలా గల్లంతయ్యాయని ఆయన ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకొచ్చారని... అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటి స్లిప్పులను లెక్కించాల్సి ఉందని... అయినా ఆ పని చేయలేదని కోదండరాం మండిపడ్డారు. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రజత్ కుమార్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కంచే చేను మేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రవర్తించడం సరికాదని అన్నారు. ఎన్నికల సంఘంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదని చెప్పారు.

More Telugu News