Chandrababu: ఆ నలుగురూ ఒకే ముసుగులో వస్తారు.. దుష్ట చతుష్టయ కూటమిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: వాసిరెడ్డి పద్మ

  • పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు
  • రాహుల్ ను కలుస్తూనే.. పవన్ ను దువ్వుతున్నారు
  • టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఒకే ముసుగులో వస్తాయి

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పొత్తుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయపడుతున్నారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఓవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలుస్తూ, మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ ను దువ్వే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబును కలసి వచ్చాక పవన్ కల్యాణ్ గురించి టీజీ వెంకటేష్ మాట్లాడారని, రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని, రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదని అన్నారని పద్మ తెలిపారు. టీజీ వ్యాఖ్యలను పవన్ ఖండించిన తర్వాత... టీజీపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు మాట్లాడారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని అన్నారు. అసహనం వ్యక్తం చేసినట్టు నటిస్తూ డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఒకే ముసుగులో వస్తారని... ఈ దుష్ట చతుష్టయ కూటమిని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

జగన్ పై దాడి కేసును విచారిస్తే చంద్రబాబుకు భయం ఎందుకని పద్మ ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. టీడీపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News