Andhra Pradesh: అగ్రవర్ణాల రిజర్వేషన్ లో 5 శాతం కాపులకే!: చంద్రబాబు

  • మిగిలినదాన్ని ఈడబ్ల్యూఎస్ కు అమలుచేస్తాం 
  • కాపులకు రిజర్వేషన్ ఇమ్మంటే బీజేపీ ఒప్పుకోలేదు
  • ఎలక్షన్ మిషన్-2019పై సీఎం టెలీకాన్ఫరెన్స్

ఏపీ మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్రం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు చట్టం చేసిందనీ, అయితే అందులో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము ఎప్పుడో కోరామని స్పష్టం చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తే, బీజేపీ నేతలు ఒప్పుకోలేదని విమర్శించారు. అమరావతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు ‘ఎలక్షన్ మిషన్ 2019’పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇప్పుడు కేంద్రం తెచ్చిన 10 శాతం కోటాలో 5 శాతం కాపులకు ఇచ్చామని చంద్రబాబు అన్నారు. మిగిలిన ఐదు శాతం రిజర్వేషన్ ను ఈడబ్ల్యూఎస్ పేదలకు ఇస్తామని తెలిపారు. కోల్ కతా సభతో బీజేపీ బెంబేలు పడుతోందనీ, కూటమిలో నలుగురు ప్రధానులు ఉన్నారని మోదీ చెప్పడం ఆయన భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏపీకే ఎక్కువ నిధులు ఇస్తున్నామని గడ్కరీ అబద్ధం చెప్పారనీ, గుజరాత్, యూపీ, మహారాష్ట్రలకే ఎక్కువ కేంద్ర నిధులు వెళ్లాయని స్పష్టం చేశారు.

ఏపీకి కేవలం టోల్ రహదారులు మంజూరు చేసి ఏదో ఉద్ధరించినట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 25న అమరావతి, కడప, విశాఖపట్నంలో పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తామనీ, మహిళా సదస్సులు చేపడతామని సీఎం తెలిపారు. ప్రస్తుతం 120 దేశాలు ఈవీఎంలను వాడటం లేదనీ, కేవలం 20 దేశాలు మాత్రమే వాడుతున్నాయని అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ విషయంలో 22 విపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News