Andhra Pradesh: విశ్వాసానికి పట్టం.. కదిరి అసెంబ్లీ సీటును డాక్టర్ సిద్ధారెడ్డికి ఇచ్చిన జగన్!

  • వివరాలు ప్రకటించిన మిథున్ రెడ్డి
  • గత ఎన్నికల్లో ఛాన్స్ కోల్పోయిన సిద్ధారెడ్డి
  • వైద్యుడిగా కదిరిలో మంచిపేరు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్న వేళ ప్రతిపక్ష వైసీపీ జోరు పెంచింది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కదిరిలో వైసీపీ నుంచి పీవీ సిద్ధారెడ్డి పోటీ చేస్తారని జిల్లా ఇన్ చార్జి, పార్లమెంటు మాజీ సభ్యుడు మిథున్ రెడ్డి ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకే సిద్ధారెడ్డి పేరును ప్రకటిస్తున్నామన్నారు.

వృత్తి రీత్యా డాక్టర్లు అయిన సిద్ధారెడ్డి, ఆయన భార్య ఉషారాణి కదిరిలోనే స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలోని నిరుపేదలకు నామమాత్రపు ఫీజుకే వైద్యం అందిస్తూ మంచిపేరు గడించారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సిద్ధారెడ్డి అప్పట్లో 18,177 ఓట్లను దక్కించుకున్నారు.

2014లో వైసీపీ తరఫున ఆయనే పోటీ చేస్తారని భావించినప్పటికీ చివరి క్షణంలో పార్టీలోకి వచ్చిన చాంద్ బాషా టికెట్ ను ఎగరేసుకుపోయారు. అయినా సిద్ధారెడ్డి వైసీపీని వీడలేదు. చాంద్ బాషా టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత కదిరి ఇన్ చార్జిగా సిద్ధారెడ్డిని జగన్ నియమించారు. అప్పట్లో సిద్ధారెడ్డికి ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ ఇప్పుడు కదిరి స్థానాన్ని ఆయనకు కేటాయించినట్టు సమాచారం.

More Telugu News