NSUI: విద్యార్థినికి ఎన్ఎస్యూఐ స్టూడెంట్ నేత వార్నింగ్, వీడియో వైరల్!

  • డిగ్రీ ఫస్టియర్ లో చేరిన విద్యార్థిని
  • తాను తలచుకుంటే కాలేజీకి రాలేవన్న ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు
  • వీడియో వైరల్ కావడంతో సస్పెన్షన్ 

ఢిగ్రీ ఫస్టియర్ లో చేరిన ఓ విద్యార్థినిని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం ఎన్ఎస్యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) నేత ఒకరు వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన షాజహాన్ పూర్ జిల్లాలో జరుగగా, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఇర్ఫాన్ హుస్సేన్ ఓ అమ్మాయిని బెదిరిస్తున్నాడు. 'నువ్వింకా ఫస్టియర్ చదువుతున్నావని, ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉండాలని, జాగ్రత్తగా ఉండు' అని అతను అంటున్నట్టు వీడియోలో వినిపిస్తోంది.

విద్యార్థినితో గొడవ పడిన అతను, "అందంగా ఉన్నావు. కాస్త హద్దుల్లో ఉంటేనే మంచిది. నేను తలచుకుంటే నువ్వు కాలేజీలోకి రాలేవు. బీ కేర్‌ ఫుల్‌" అని అన్నాడు. ఈ బెదిరింపుల సమయంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు అక్కడే ఉండి కూడా, అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్లకు పనిచెప్పి, జరుగుతున్నదాన్ని వీడియో తీశారు.

కాగా, ఈ వీడియో వైరల్ కావడం, ఇర్ఫాన్ పై విమర్శలు వెల్లువెత్తడంతో జాతీయ ఎన్ఎస్యూఐ స్పందించి, అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు సదరు విద్యార్థిని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

More Telugu News