Telangana: ఎర్రవల్లిలో నేడు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం.. ఫాంహౌస్ కు చేరుకున్న కేసీఆర్!

  • ఐదు రోజుల పాటు సాగనున్న యాగం
  • 250 మంది రుత్విక్కుల సమక్షంలో పూజలు
  • టీఆర్ఎస్ నేతలను ఆహ్వానించిన మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి మరో యాగానికి సిద్ధమయ్యారు. తెలంగాణలో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలో ఉన్న తన ఫాంహౌస్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం నిర్వహించనున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగనున్న ఈ యాగం కోసం కేసీఆర్ నిన్న సాయంత్రమే ఫాంహౌస్ కు చేరుకున్నారు. యాగం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, రుత్విక్‌వరణ కార్యక్రమాలతో యాగానికి అంకురార్పణ చేస్తారు.

శృంగేరీ పీఠం సంప్రదాయ పద్ధతిలో, ఆ పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ, తెలంగాణ పత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహనశర్మ పర్యవేక్షణలో ఐదు రోజులపాటు ఈ క్రతువు సాగనుంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో యాగం ప్రారంభం కానుంది. ఈ యాగానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను అధినేత కేసీఆర్ ఆహ్వానించారు.

తెలంగాణ సీఎం ఇంతకుముందు రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగ నిర్వహణ కోసం 3 యాగ శాలలు, 16 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన 200 మంది, తెలంగాణ నుంచి వచ్చిన 50 మంది రుత్విక్కులు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

More Telugu News