bharatiyudu: ఆ ఘటనే నాతో ‘భారతీయుడు’ తీయించేలా చేసింది: దర్శకుడు శంకర్

  • నా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు లంచం అడిగారు
  • ఈ సంఘటన నా కాలేజ్ రోజుల్లో జరిగింది
  • ఈ ప్రేరణతోనే ‘భారతీయుడు’ తీశాను

1996లో శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భారతీయుడు’. ఈ చిత్రం సీక్వెల్ ‘భారతీయుడు-2’ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయింది. నాడు బ్లాక్ బస్టర్ గా రికార్డులు నెలకొల్పిన ‘భారతీయుడు’ని తెరపైకి ఎక్కించడానికి గల కారణాన్ని దర్శకుడు శంకర్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకున్నారు.

కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెళితే తన కుల, ఆదాయానికి సంబంధించిన ధ్రువీకరణపత్రాలు కావాలని యాజమాన్యం తనను అడిగిందని శంకర్ చెప్పారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత అధికారుల వద్దకు తన తల్లిదండ్రులు వెళితే తమకు లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేసిన విషయాన్ని శంకర్ గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన ప్రేరణే తనతో ‘భారతీయుడు’ చిత్రాన్ని తీయించేలా చేసిందని పేర్కొన్నారు. ఇక, ‘భారతీయుడు-2’ గురించి శంకర్ ప్రస్తావిస్తూ, ప్రస్తుత సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యనే ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు చెప్పారు. కాగా, ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సంగీతం అనిరుధ్ అందిస్తున్నాడు.

More Telugu News