Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిన కోర్టు!

  • ముగిసిన ఎన్ఐఏ కస్టడీ
  • భద్రత కల్పించలేమన్న విజయవాడ పోలీసులు
  •  25 వరకూ జ్యుడీషియల్ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు కోర్టు ఈ నెల 25 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏకు ఇచ్చిన వారం రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు శ్రీనివాసరావును ఈరోజు విజయవాడలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనకు మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని నిందితుడు కోరగా, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో రక్షణ లేదని అతని న్యాయవాది అబ్దుల్ సలీం ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విషయమై న్యాయమూర్తి ప్రశ్నించగా.. విజయవాడలో భద్రత కల్పించలేమని ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. దీంతో శ్రీనివాసరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని అధికారులను జడ్జి ఆదేశించారు. మరోవైపు సిట్ అధికారులు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఎన్ఐఏ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 23కు న్యాయమూర్తి వాయిదా వేశారు.

దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు నోటీసులు జారీచేశారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. లోతయిన గాయం కావడంతో హైదరాబాద్ కు చేరుకున్న జగన్ అక్కడ చికిత్స చేయించుకున్నారు.

More Telugu News