ntr: ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత.. పేదరికంపై గెలుపే మనం ఆయనకు ఇచ్చే నివాళి!: చంద్రబాబు

  • సంక్షేమ పథకాలకు ఆయన ఆద్యుడు
  • ఆయన స్ఫూర్తితోనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం
  • టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి ఓ సంకల్ప దినమని వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తితో అందరూ సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలనీ, పేదల సేవలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పేదరికంపై గెలుపే ఎన్టీఆర్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా అమరావతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంక్షేమ పథకాలకు ఎన్టీఆరే ఆద్యుడని చంద్రబాబు తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే పింఛన్ ను 10 రెట్లు పెంచామని అన్నారు. నగదు బదిలీ, విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబ ఆదాయాన్ని పెంచడం, కనీసం రూ.10 వేలు అందుకునేలా చూడటం, ఆరోగ్యం మెరుగయ్యేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చెప్పారు.

More Telugu News