Karnataka: కట్నం వద్దన్నాడు.. మాయలో పడగానే దారుణంగా మోసం చేశాడు!

  • మ్యాట్రిమోనియల్ సైట్ లో ప్రొఫైల్ పెట్టిన యువతి
  • నమ్మించి, రూ. 25 లక్షలు నొక్కేసిన ఘనుడు
  • బెంగళూరులో ఘటన

ఆ యువతి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తెస్తుంటే, అంగీకరించి, ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో పేరు నమోదు చేసుకుంది. ఆపై పరిచయమైన ఓ మోసగాడు, పెళ్లి పేరిట ఆమెను దారుణంగా మోసం చేశాడు.

బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళితే, పుట్టినహళ్ళి ప్రాంతానికి చెందిన ఓ యువతి, సర్జాపుర రోడ్ లోని ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమె ప్రొఫైల్ ను చూసిన రోనిత్ మల్ హోత్రా అనే యువకుడు, గత సంవత్సరం మార్చిలో ఫోన్ చేశాడు. తనది ఢిల్లీ అని, బెంగళూరులోనే సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నానని చెప్పాడు.

ఒకసారి కలిసి మాట్లాడుకుందామని, ఆపై నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని చెప్పడంతో ఆమె సరేనంది. ఇద్దరూ కలసి మాట్లాడుకున్నారు. అతని ప్రవర్తన ఆమెకు నచ్చింది. తనకు కట్నం వద్దని అతను చెబితే నమ్మింది. ఆపై ప్రత్యేక పూజలు చేయించాల్సివుందని చెప్పి రూ. 7.50 లక్షలు తీసుకున్నాడు. పట్టు చీరలని, బంగారమని చెప్పి మోసం చేశాడు.

మరో పది రోజుల తరువాత అర్జంటుగా కావాలంటూ రూ. 6 లక్షలు, నెల తరువాత పర్సనల్ ఖర్చులున్నాయంటూ రూ. 9 లక్షలు లాగేశాడు. సుమారు రూ. 25 లక్షలు గుంజిన తరువాత, తన సెల్ ఫోన్ నంబర్ మార్చేసి, తప్పించుకున్నాడు. తాను దారుణంగా మోసపోయానని గ్రహించేందుకు ఆమెకు రెండు మూడు నెలల సమయం పట్టింది. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి, నిందితునిపై సెక్షన్ 420 కింద కేసు పెట్టినట్టు తెలిపారు. 

More Telugu News