Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ విమర్శలు!

  • జగన్ మేనిఫెస్టోను బాబు అమలు చేస్తున్నారు
  • హామీలను అమలుచేసుంటే మహానాయకుడు అయ్యేవారు
  • ట్విట్టర్ లో స్పందించిన సినీ విమర్శకుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు యథాతథంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలను అమలు చేసి ఉంటే మహానాయకుడు అయ్యేవారనీ, బయోపిక్ కు అర్హత సాధించేవారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్రుటిలో ఛాన్స్ మిస్ అయిపోయిందని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నాయకుడి ఎన్నికల మ్యానిఫెస్టోని యథాతథంగా అమలుపర్చుతున్న నాయకుడు చంద్రబాబు గారు. తాను ఇచ్చిన 600 హామీలను కూడా నెరవేర్చి ఉంటే, మహానాయకుడు అయ్యేవారు. బయోపిక్ కి అర్హత సాధించేవారు. ప్చ్...జస్ట్ ఛాన్స్ మిస్!’ అని ట్వీట్ చేశారు.

అలాగే మరో ట్వీట్ లో ‘శంకుస్థాపనలు...శంకుస్థాపనలు! ఉత్తుత్తి ఉక్కు ఫ్యాక్టరీ నుంచీ గాలిలో తేలే బ్రిడ్జీల వరకూ. నాలుగున్నర సంవత్సరాల్లో చేయలేని పనులను ఎన్నికలకు 4 నెలల ముందు, వస్తే చేస్తాం అని భ్రమలు కల్పించడం బాబుగారికే చెల్లు. సాహో చంద్రబాబు!’ అని వ్యాఖ్యానించారు.

అక్కడితో ఆగకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా కత్తి మహేశ్ విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ మోదీ భక్తుడైపోయారని సెటైర్ వేశారు. ట్విట్టర్ లో స్పందిస్తూ..‘జాగోరే జాగో అంటే తెలుగు జనాలకు అర్థం కాదేమో పవన్ కళ్యాణ్ గారు...మీరు ఎంత మోదీ భక్తులయినా, మరీ ఇలా పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఇంప్రెస్ చెయ్యడానికి హిందీ టైటిల్స్ పెట్టాల్సిన అవసరం లేదేమో!@PawanKalyan’ అని ట్వీట్ చేశారు.

More Telugu News