Andhra Pradesh: విచారణలో తిడతారు, కొడతారు, బెదిరిస్తారు.. అందుకే కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది!: శ్రీనివాసరావు లాయర్ సలీం

  • అందుకే లాయర్ సమక్షంలో విచారణ జరపాలన్నారు
  • సిట్, ఎన్ఐఏ విచారణకు పెద్ద తేడా ఉండదు
  • నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నాం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును విజయవాడ కోర్టు ఏడు రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి హైదరాబాద్ లోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీం స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుకు, ఎన్ఐఏ దర్యాప్తుకు పెద్ద తేడా ఉండదని తెలిపారు.

సాధారణంగా విచారణలో భాగంగా అధికారులు నిందితులను కొట్టడం, తిట్టడం, బెదిరించడం వంటివి చేస్తారని, అందువల్లే లాయర్ సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. శ్రీనివాసరావుకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు శ్రీనివాసరావును హైదరాబాద్ లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయానికి తరలిస్తారని పేర్కొన్నారు. నిందితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి విచారించినా తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చిచెప్పారు.

More Telugu News