q net: ‘క్యూనెట్’ కుంభకోణంలో విచారణ ముమ్మరం.. 60 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!

  • రూ.2.07 కోట్లు స్వాధీనం, 40 బ్యాంకు ఖాతాల సీజ్
  • విదేశాల నుంచి కంపెనీని ఆపరేట్ చేస్తున్న ముఠా
  • మోసం బయటపడగానే కొత్తపేరుతో బిజినెస్

తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే భారీగా రాబడులు ఇస్తామంటూ మోసం చేసిన క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేసిన అధికారులు, రూ.2.07 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ ఖాతాలను జప్తు చేశారు. ఈ క్రమంలో చాలామంది బాధితులు సైబరాబాద్ కమిషనరేట్ కు క్యూ కడుతున్నారు.

అధికారులు విచారణను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో క్యూనెట్ కుంభకోణంపై గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్న గుర్మీత్, అనూజలు ఈరోజు ముంబై నుండి వచ్చి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. క్యూనెట్ నిర్వాహకులు నిజమైన కంపెనీ పేరు మీద ఎప్పుడూ వ్యాపారం నిర్వహించరని తెలిపారు.

ఏదైనా వివాదంలో కంపెనీ ఇరుక్కుంటే లేదా మోసం బయటపడగానే వెంటనే పేరును మార్చేసి మరో కొత్త పేరుతో వ్యాపారంలోకి దిగుతారని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండి ఈ కంపెనీని నిందితులు ఆపరేట్ చేస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ను కోరినట్లు పేర్కొన్నారు.

More Telugu News