railway: ఆ ఉద్యోగాల్లోకి మహిళలను తీసుకోవద్దు... ట్రైనింగ్‌ విభాగానికి రైల్వేశాఖ వినతి

  • భద్రతా పరమైన ఇబ్బందులున్నాయనే ఈ సూచన
  • డ్రైవర్లు, పోర్టర్లు, గార్డు, ట్రాక్‌మెన్‌ పోస్టులు కష్టమైనవి
  • కఠినమైన పనులు కావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం

రైల్వేలోని డ్రైవర్లు, పోర్టర్లు, గార్డు, ట్రాక్‌ (ఉ)మెన్‌ వంటి పోస్టుల్లో విధులు కఠినంగా ఉంటాయని, పైగా భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నందున అటువంటి పోస్టులకు మహిళలను తీసుకోవద్దని ఉన్నతాధికారులు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి లేఖ రాశారు. రైల్వే శాఖలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో మహిళల సంఖ్య 2 నుంచి 3 శాతం వరకు ఉంది. వీరిలో చాలామంది డెస్కుల్లో, కార్యాలయాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు, పోర్టర్లు, గార్డులు, ట్రాక్‌మెన్‌ ఉద్యోగాల్లోనూ కొందరు పనిచేస్తున్నారు.

ఒక రైల్లో సాధారణంగా ఇద్దరు డ్రైవర్‌లు మాత్రమే ఉంటారు. గార్డులు రైలు చివరి బోగిలో ఉంటారు. పోర్టర్లు స్టేషన్లలో బరువైన లగేజీలను ఎత్తాలి. రైల్వే ట్రాక్‌లను పరిశీలించేందుకు ట్రాక్‌(ఉ)మెన్‌లు ఒంటరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో వారికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఇలా కోరుతున్నట్లు పేర్కొంది. ఈ విధంగా కోరడంలో మహిళల పట్ల తమకు ఎటువంటి వివక్ష లేదని, వారి భద్రత దృష్ట్యా మాత్రమే ఈ సూచన చేస్తున్నామని పేర్కొంది. కొన్నిపోస్టుల్లో పని వాతావరణం మహిళలకు సానుకూలంగా ఉండదని, కొన్ని సమయాల్లో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే ఈ పోస్టుల్లో పురుషులను మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు.

దీనిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రయినింగ్‌ విభాగం ఇంతవరకూ స్పందించ లేదు. ఉద్యోగుల యూనియన్‌ మాత్రం దీన్ని తప్పుబడుతోంది. మహిళలను తీసుకోకుండా ఉండే బదులు, వారికి సదుపాయాలను మెరుగుపరిస్తే బాగుంటుందని  యూనియన్‌ సభ్యులు సూచిస్తున్నారు. రైల్వేల్లో మహిళలకు సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్లే భద్రత సాకుతో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ అడ్డుపుల్ల వేస్తోందని ఆరోపించారు.

More Telugu News