ashok babu: అశోక్ బాబుది నకిలీ సర్టిఫికెట్.. ఆయన వీఆర్ఎస్ ను ఆమోదించవద్దు: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ సర్కిల్-1 ప్రెసిడెంట్ మెహర్

  • ఇంటర్ విద్యార్హతతో అశోక్ బాబు ఉద్యోగంలో చేరారు
  • నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు
  • ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ జరపాలి

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ సర్కిల్-1 ప్రెసిడెంట్ మెహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో అశోక్ బాబు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంటర్ విద్యార్హతతో అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందారని... డిగ్రీ పాసైనట్టు ఉన్న సర్వీస్ రికార్డుతో ఇప్పుడు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పై ఉన్నతాధికారులు విచారణ జరపాలని... అంత వరకు వీఆర్ఎస్ ను ఆమోదించరాదని కోరారు. విచారణ జరపకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఏప్రిల్ లో పదవీ విరమణ చేయాల్సిన అశోక్ బాబు ముందస్తుగా పదవీ విరమణ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని మెహర్ డిమాండ్ చేశారు. నకిలీ సర్టిఫికెట్ భాగోతం నుంచి అశోక్ బాబును కాపాడేందుకు అధికారులు యత్నిస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు రోల్ మోడల్ గా ఉండాల్సిన అశోక్ బాబు... ఇలాంటి పనులకు పాల్పడటం దారుణమని చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లేందుకే అశోక్ బాబు ముందస్తు పదవీ విరమణకు వెళ్తున్నారని అన్నారు. అశోక్ బాబును ఏ పార్టీ కూడా చేర్చుకోరాదని కోరారు. మరోవైపు అశోక్ బాబును సమర్థిస్తున్న ఉద్యోగులు... మెహర్ ఆరోపణలను ఖండించారు.

More Telugu News