Hyderabad: హైదరాబాదు గొలుసు దొంగలు దొరికిపోయారు.. పట్టించిన గూగుల్ పే!

  • మహిళల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన దొంగలు
  • 19 గంటల వ్యవధిలో 11 గొలుసు చోరీలు
  • సవాలుగా తీసుకుని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌లో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన వారికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరదండాలు వేశారు. రెండు వారాల క్రితం 19 గంటల వ్యవధిలో 11 మంది మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం సంచలనమైంది. దీంతో మహిళలు బయటకు రావాలంటనే భయపడ్డారు.

ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను నోయిడాకు చెందిన మోనా వాల్మీకి, బులంద్‌షహర్‌కు చెందిన చోకా, హైదరాబాద్‌కు చెందిన చింతమళ్ల ప్రణీత్ చౌదరిగా గుర్తించారు. దొంగల కోసం ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్లి ఆధారాలు సేకరించారు. చివరికి దొంగలు ముగ్గురూ హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలుసుకుని నిఘా పెట్టారు.

బుధవారం ఈదీబజార్‌లో బైక్‌పై వెళ్తున్న మోను, చోకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో హోటల్‌లో ఉన్న ప్రణీత్ చౌదరిని పట్టుకున్నారు. వీరి నుంచి 350 గ్రాముల బంగారం, రెండు బైక్‌లు, ఒక డాగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కలిసి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బులంద్‌షహర్‌లలో 150కిపైగా దొంగతనాలు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. ప్రణీత్ చౌదరి తాను బసచేసిన హోటల్ బిల్లును గూగుల్ పే ద్వారా చెల్లించాడని, నిందితులను పట్టుకోవడంలో ఈ లావాదేవీ కీలకం అయిందని సీపీ తెలిపారు.  

More Telugu News