Wanaparthy District: పంట పొలంలో రైతుపై గొర్రెల కాపరి గొడ్డలితో దాడి

  • యజమానికి తీవ్రగాయాలు
  • తన పొలంలో గొర్రెలు మేపవద్దన్న సందర్భంగా ఇద్దరి మధ్య వివాదం
  • ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు

తన పత్తి పొలంలో గొర్రెలు మేపుతున్న వ్యక్తిని వాటిని తోలుకు వెళ్లాలని కోరినంతనే గొర్రెల కాపరి గొడ్డలితో దాడిచేసిన ఘటన ఇది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేశంపేట సమీపంలోని కాకునూరు గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణ తన పొలంలో పత్తి పంట సాగు చేశాడు. మంగళవారం గొర్రెల కాపరి కరిక నరసింహులు తన గొర్రెలను తోలుకుని వెళ్లి పత్తిపంటలో వాటిని మేతకు వదిలాడు. దీన్ని గమనించిన కృష్ణ పంట పాడయ్యే అవకాశం ఉన్నందున తన పొలం నుంచి గొర్రెలను తోలుకు వెళ్లాలని సూచించాడు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై మాటామాటా పెరిగింది. ఆవేశానికి లోనైన నర్సింహులు తన వద్ద ఉన్న గొడ్డలితో కృష్ణపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ తల్లి లింగాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News