goa: ప్రాణభయంతోనే ఆ గోవా మంత్రి బీజేపీలో చేరారు: ఏఐసీసీ కార్యదర్శి చల్లా కుమార్‌

  • ఈ విషయాన్ని పార్టీ మారే ముందు ఆయనే స్వయంగా చెప్పారు
  • తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పార్టీ మారుతున్నట్లు వాపోయారు
  • రాఫెల్‌ ఒప్పందం ఆడియో టేపుల్లో గోవా ఆరోగ్యశాఖ మంత్రి

గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్‌ ప్రతాప్‌రాణే ప్రాణభయంతోనే కాంగ్రెస్‌ పార్టీని వీడి కమలనాథుల పంచన చేరారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా కుమార్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని 2017లో పార్టీ వీడే ముందు స్వయంగా విశ్వజిత్‌ తనకు తెలియజేశాడని, కావాలంటే ఈ విషయంలో నిజనిర్థారణ పరీక్షలు చేసుకోవచ్చని సవాల్‌ విసిరారు.

రాజకీయ దుమారానికి కారణమైన రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో ఆడియో టేపుల వ్యవహారం ద్వారా విశ్వజిత్‌ వార్తల్లో వ్యక్తి అయ్యారు. తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, అందుకే తాను బీజేపీతో కలిసి వెళ్తున్నానని విశ్వజిత్‌ వాపోయారని కుమార్‌ తెలిపారు. అతను చెప్పిన ప్రమాదం బీజేపీ చీఫ్‌ అమిత్‌షా, ప్రధాని మోదీ నుంచేనని కుమార్‌ ఆరోపించారు.

కాగా, ఈ ఆరోపణలను విశ్వజిత్‌ కొట్టిపారేశారు. ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడం కాంగ్రెస్‌ నైజమన్నారు. నిరాశ, నిస్పృహలతోనే చల్లా కుమార్‌ ఇటువంటి ఆరోపణలు చేసి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. అసలు ఆ ఆడియో టేప్‌ నిజం కాదని, అది సృష్టించిందని, దాని కోసం భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు.

More Telugu News