LJP: ఈ బిల్లు వల్ల ఎస్సీలు, వెనుకబడిన వర్గాలకు ఎటువంటి నష్టం జరగదు: రాంవిలాస్ పాశ్వాన్

  • ‘అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్’కు మద్దతిస్తున్నాం
  • జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
  • రిజర్వేషన్ల పెంపును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
  • తద్వారా న్యాయ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండదు

‘అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్’ కు సంబంధించి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ మూడు సూచనలు చేశారు. ఈ అంశానికి సంబంధించి లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల బిల్లుకు తాము మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు.

 దీనికి మద్దతిచ్చిన ఆయన, జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ల పెంపును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని, తద్వారా న్యాయ సమీక్షకు వెళ్లే అవకాశం ఉండదని మూడు సూచనలు చేేశారు. ప్రైవేటు రంగంలోనూ 60 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలు, వెనుకబడిన వర్గాలకు ఈ రిజర్వేషన్ల బిల్లు వల్ల నష్టం జరగదని, వేర్వేరు మతాల్లోని పేదలకు కూడా ఈ బిల్లు వల్ల లబ్ది కలుగుతుందని అన్నారు.

సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కోసమే ఆర్టికల్ 16(4) తీసుకురావడం జరిగిందని, సామాజిక న్యాయం కోసం పోరాడే వారిలో అన్ని వర్గాల వారూ ఉన్నారని అన్నారు. ఆ సమయంలో ధనవంతులు, భూస్వాములుగా ఉన్నవారు ఇప్పుడు పేదలుగా మారారని, రిజర్వేషన్లకు సంబంధించి కాకా కర్లేకర్, మండల కమిషన్ ఎన్నో సిఫారసులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వాటికి సంబంధించిన కులాల జాబితాలపైన ఎన్నో వైరుధ్యాలు, వివాదాలు ఉన్నాయని అన్నారు.

ఇంతకాలం.. ప్రధాని మోదీ రామ మందిరం జపం చేస్తారని అంతా విమర్శించారని, ఆయన మాత్రం అన్ని వర్గాల అభ్యున్నతిపైనే దృష్టి పెట్టారని పాశ్వాన్ కొనియాడారు. మోదీ పార్లమెంట్ కు వస్తూనే దాని ముందు ప్రణమిల్లి ‘ఇదే దేవాలయం’ అని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.   

More Telugu News