Khammam District: పార్టీలో చేరిన స్వార్థపరుల వల్లే ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ దెబ్బతింది: తుమ్మల నాగేశ్వరరావు

  • జిల్లాలో ఏం జరిగిందన్నది సీఎం కేసీఆర్‌కు తెలుసు
  • పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు బజారున పడ్డారు
  • సత్తుపల్లిలో దెబ్బతినడానికీ ఇదే కారణం

పార్టీలోని అంతర్గత వ్యవహారాలే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ దెబ్బతినడానికి ప్రధాన కారణమని, కొందరు స్వార్థపరులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బజారున పడి తీవ్రనష్టం కలిగించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సత్తుపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా రాజకీయ విలువలు తెలియని కొందరు పార్టీలో చేరారని, అధినేత ఆదేశాలను సైతం కాదని సొంత అజెండా అమలు చేశారని ధ్వజమెత్తారు.

సత్తుపల్లితోపాటు జిల్లాలోనూ ఈ కారణంగానే పార్టీ పుట్టిమునిగిందని వ్యాఖ్యానించారు. సమస్య ఉంటే పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప వీధిపోరాటాలు చేస్తే ప్రయోజనం ఉండదని ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందరినీ కలుపుకొని పోవాలని తాను ఎంతో తపన పడ్డానని చెప్పారు. ముప్పై ఏళ్లలో జిల్లా సాధించని అభివృద్ధిని మూడేళ్లలో తాను సాధించి చూపానని, అభివృద్ధిలో జిల్లాను ముందుంచానని అన్నారు. కానీ చేసిన అభివృద్నంతా కొందరు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశారని ధ్వజమెత్తారు.

మన వేలుతో మన కంటినే పొడుచుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చింతించాల్సిన అవసరంగాని, ఎవరినీ నిందించాల్సిన పనిగాని లేదని చెప్పారు. జిల్లాలో రాజకీయాలన్నీ కేసీఆర్‌కు తెలుసునని, సమయం వచ్చినప్పుడు ఆయనే సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీలో కొనసాగాలంటే పార్టీ నిర్ణయం, అధ్యక్షుడి ఆదేశానుసారం వెళ్లాల్సిందేనని, సొంత అజెండా అమలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.

More Telugu News