Andhra Pradesh: ‘నంద్యాల’ పార్లమెంటు స్థానంపై టీడీపీలో పంచాయితీ.. సీటు తనదేనన్న ఎస్పీవై రెడ్డి!

  • సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి
  • గతంలో ఎస్పీవై రెడ్డికి అసెంబ్లీ సీటు ఇస్తామన్న లోకేశ్
  • అల్లుడికి నంద్యాల అసెంబ్లీ కోరుతున్న ఎస్పీవై రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయంపై టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్ పై తానే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ కేటాయిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలుపొందిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు.

కాగా, నంద్యాల అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబును కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో ఎస్పీవై రెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటును, బుట్టా రేణుకకు పార్లమెంటు స్థానం ఇస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో కర్నూలుకు చెందిన టీడీపీ నేత టీజీ వెంకటేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్పీవై రెడ్డి లోకేశ్ ను హిప్నటైజ్ చేసుంటారనీ, అందుకే ఆయన అలాంటి ప్రకటన చేశారని వెంకటేశ్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

More Telugu News