Donald Trump: తాలిబన్లతో 6 వేల మైళ్ల దూరంలో ఉన్న మేమే పోరాడాలా? ఇండియా ఎందుకు చేయదు?: ట్రంప్ సూటి ప్రశ్న

  • ఉగ్రవాదంపై మేమే పోరాడాలా?
  • లైబ్రరీ నిర్మిస్తున్నట్టు మోదీ పదేపదే చెప్పారు
  • ఏముంది దాని వల్ల ఉపయోగం?

భారత నిధులతో ఆఫ్ఘనిస్థాన్‌లో నిర్మిస్తున్న లైబ్రరీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘాన్-భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌లో నిర్మించిన లైబ్రరీని ఎవరు ఉపయోగించుకుంటున్నారో తనకు తెలియదన్నారు. నిత్యం అంతర్యుద్ధంతో అట్టుడికే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లతో తామే ఎందుకు పోరాడాలని ప్రశ్నించారు. భారత్, రష్యా, పాకిస్థాన్‌లు ఎందుకు పోరాడకూడదని సూటిగా ప్రశ్నించారు.

ఎక్కడో ఆరు వేల మైళ్ల దూరంలో ఉన్న తామే ఎందుకు పోరాడాలని ప్రశ్నిస్తూనే.. అయినా ఈ విషయంలో తామేమీ బాధపడడం లేదన్నారు.  ‘‘ఎందుకు? రష్యా ఎందుకు పోరాడకూడదు? మేమే ఎందుకు కావాలి? భారత్,  పాకిస్థాన్ ఎందుకు కాకూడదు?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతికి, అభివృద్ధికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. తాలిబన్లపై పోరాడేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 ఆఫ్ఘాన్‌లో పోరు కోసం అమెరికా బిలియన్ల డాలర్లను వెచ్చిస్తోందన్నారు. చాలా దేశాల ముఖ్యనేతలు ఆఫ్ఘాన్‌లో శాంతి స్థాపనకు ముందుకొస్తామని చెబుతూ 100-200 మంది సైనికులను మాత్రమే పంపిస్తామని తనతో చెప్పారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆఫ్ఘనిస్థాన్‌లో లైబ్రరీ నిర్మిస్తామని మోదీ పదేపదే నాతో చెప్పారు. ఏముంది దానివల్ల ఉపయోగం.. ఓ ఐదు గంటలకు మించి అక్కడ ఉండగలమా?’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

More Telugu News