federal front: అసలు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది?: సీఎం చంద్రబాబు

  • మోదీ, జైట్లీ కలిసి ప్రమోట్ చేస్తున్నదే ఈ ఫెడరల్ ఫ్రంట్
  • ఈ ఫ్రంట్ లో ఉంటున్నట్టు ‘తృణమూల్’ చెప్పలేదు
  • తెలంగాణలో ప్రజాకూటమి విఫలం కాలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తానన్న ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ కలిసి ప్రమోట్ చేస్తున్నదే ఈ ఫెడరల్ ఫ్రంట్ అని అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లకు లాభం చేకూరుతుందనే దీన్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు.

 ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ చెప్పలేదని, ఆ పార్టీ ప్రకటించకపోయినప్పటికీ ఈ విషయమై కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విఫలమైందంటూ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో ప్రజాకూటమి విఫలం కాలేదని, విఫలమైంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ, జైట్లీలని విమర్శించారు. దేశంలో ఉన్నవి రెండే కూటములని, అందులో ఒకటి ఎన్డీఏ.. దానికి మద్దతు పలుకుతున్న పార్టీలు కాగా, రెండోది కాంగ్రెస్, దాని పక్షాన నిలిచిన పార్టీల కూటమి అని పేర్కొన్నారు.

More Telugu News