2018: 2019లో ప్రపంచంలో ఇవి మాత్రం గ్యారెంటీగా జరుగుతాయి!

  • ఈ సంవత్సరమే భారత ఎన్నికలు
  • ప్రపంచకప్ క్రికెట్ పోటీలు కూడా
  • ఈ సంవత్సరం ఐదు సూర్య గ్రహణాలు
  • బాధ్యతలను వారసుడికి అప్పగించనున్న జపాన్ రాజు

మరో ఏడాది కాలగతిలో కలిసిపోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ అంబరాలు సంబరాన్ని అంటాయి. ఇక ఈ సంవత్సరం జరగబోయే కొన్ని ప్రధానమైన అంశాలను పరిశీలిస్తే... ముందుగా చెప్పుకోవాల్సింది, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు. ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతావనిలో ఈ సంవత్సరం ప్రజలు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. మార్చి నుంచి మే మధ్య లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి.

ఇక వీటి తరువాత అత్యధికులు ఆసక్తిగా ఎదురుచూసేది వరల్డ్ కప్ క్రికెట్ గురించేననడంలో ఆశ్చర్యం లేదు. కోహ్లీ సేన ఈ సంవత్సరం ప్రపంచకప్ ను ముద్దాడుతుందని, ఇండియాకు ప్రపంచ కప్ ను అందించిన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీల సరసన కోహ్లీ కూడా నిలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం ఐసీసీ వరల్డ్ కప్ లో 10 దేశాలు పాల్గొంటున్నాయి. అన్నీ ఒకే గ్రూప్ లో ఉండి ప్రతి దేశమూ, మిగతా 9 దేశాలతో ఆడుతుంది. టాప్-4 జట్లు సెమీస్ కు చేరుతాయి. మొత్తం 46 రోజుల పాటు ఈ వేడుక జరగనుండగా, 48 మ్యాచ్ లు జరుగుతాయి.

ఎన్నికలు, క్రికెట్ లను పక్కన పెడితే, 2018లో జరిగిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి సెల్ ఫోన్ లో మొబైల్ డేటా ధర గణనీయంగా తగ్గడం. 2014లో 1 జీబీ డేటాకు దాదాపు 269 రూపాయల ధర ఉండగా, 2018లో అది 16 రూపాయలకు దిగింది. ఈ సంవత్సరం డేటా ఖరీదు జీబీలకు బదులు టీబీల్లో లెక్కించాల్సి రావచ్చు.

ఇక ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతావని 2018 సంవత్సరం 2.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల జాబితాలో 9 నుంచి 6వ స్థానానికి చేరింది. ఈ సంవత్సరం మరో స్థానాన్ని పెరిగి టాప్ 5లో చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఒక్కసారి ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే, నేటి నుంచి బ్రెజిల్ కొత్త అధ్యక్షుడు జైర్ బోల్సానోరో, తన నాలుగేళ్ల పదవీ కాలాన్ని ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 16న ఆఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న నైజీరియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 29న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెజిల్ వైదొలగనుంది.

అయితే, బ్రెగ్జిట్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండాలి. ఏప్రిల్ 17న అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండొనేషియాలో ఎన్నికలు జరగనున్నాయి. మేలో యూరోపియన్ పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతాయి. (బ్రెగ్జిట్ సంభవమైతే). జూన్ 28న జపాన్ తొలిసారిగా జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలైలో ఆఫ్గనిస్థాన్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 21న కెనడా ప్రజలు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. డిసెంబర్ లో నోబెల్ బహుమతుల ప్రధానం ఉంటుంది.

2019లో మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. జనవరి 6న పాక్షిక సూర్య గ్రహణం, జనవరి 20న సంపూర్ణ చంద్రగ్రహణం, ఆపై జూలై 2న సంపూర్ణ సూర్య గ్రహణం, జూలై 16న పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబర్ 26న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనున్నాయి. డిసెంబర్ 26న ఏర్పడే సంపూర్ణ సూర్య గ్రహణాన్ని దక్షిణ భారత ప్రజలతో పాటు శ్రీలంక, సౌదీ ప్రజలు తిలకించవచ్చు. ఇది 3.30 గంటలపాటు కనువిందు చేస్తుంది.

జపాన్ రాజు అకిహితో ఏప్రిల్ 30న తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. జపాన్ రాచరికంలో రాజు తనంతట తానుగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవడం అన్నది దాదాపు రెండు శతాబ్దాల తరువాత ఇదే తొలిసారి. రాజు మరణించిన తరువాతనే కొత్త వారసుడిని ప్రకటించే జపాన్ లో 1817లో చక్రవర్తి కొకారు తన బాధ్యతలను వీడగా, ఆపై స్వయంగా బాధ్యతలను వారసుడికి అప్పగించనున్న చక్రవర్తికి అకిహితో నిలవనున్నారు. ప్రస్తుతం 85 సంవత్సరాల వయసున్న ఆయన, వృద్ధాప్య కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన తన కుమారుడు నారుహితోకు జపాన్ 126 చక్రవర్తిగా బాధ్యతలు అప్పగించనున్నారు.

More Telugu News