GST: తగ్గిన జీఎస్టీతో నేటి నుంచి చౌకగా లభించే ఉత్పత్తులివి!

  • 23 రకాల వస్తు సేవలపై తగ్గిన జీఎస్టీ
  • 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
  • పలు వస్తువులపై జీఎస్టీ 5 శాతానికి

నేటి నుంచి 23 రకాల వస్తు సేవలపై తగ్గించిన జీఎస్‌టీ రేట్లు అమలులోకి వచ్చాయి. డిసెంబర్‌ 22న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో జీఎస్టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. పన్ను తగ్గింపు తరువాత సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌ బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయలు తదితరాలు చౌకగా లభించనున్నాయి. ఈ ఉత్పత్తులపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు.

 ట్రాన్స్‌ మిషన్‌ షాఫ్ట్, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్‌ ఉత్పత్తులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌, వీడియో గేమ్‌ తదితరాల ధరలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో దివ్యాంగులకు అవసరమయ్యే ఉపకరణాలపై ప్రస్తుతం 28 శాతం పన్నును వసూలు చేస్తుండగా, దాన్ని 5 శాతానికి తగ్గించారు. రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను 18 నుంచి 12 శాతానికి తగ్గించారు.

తాజాగా, 5 శాతం శ్లాబులోకి ఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లు తదితరాలను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే చిన్న విమాన సర్వీసులపైనా 5 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు కానుంది. శీతలీకరించిన, ప్యాక్‌ చేసిన కూరగాయలు, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలను కూడా తక్కువ పన్ను శ్లాబ్ లోకి మార్చారు.

More Telugu News