Andhra Pradesh: ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింల విడాకులు 4 లక్షలకు చేరుకుంటాయ్!: టీజీ వెంకటేశ్ హెచ్చరిక

  • కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వెళుతోంది
  • దేశంలో ఇప్పుడు ట్రిపుల్ తలాక్ కేసులు తక్కువే
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం చట్టవిరుద్ధంగా వెళుతోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విమర్శించారు. ప్రజలు ఏ మతానికి చెందనవారయినా చేసిన తప్పుకు ఒకే శిక్ష ఉండాలని వ్యాఖ్యానించారు. భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చే ముస్లిం భర్తకు మూడేళ్లు, మిగతా మతాల్లో విడాకులు ఇచ్చే భర్తకు ఏడాది జైలుశిక్ష విధించడం సరికాదని తెలిపారు. కేంద్రం చేస్తున్న పనితో పరిస్థితులు మరింత దిగజారుతాయని టీజీ హెచ్చరించారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.

గతేడాది దేశవ్యాప్తంగా 400-500కు మించి ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాలేదని టీజీ వెంకటేశ్ తెలిపారు. ఈ చట్టం దెబ్బకు భార్యాభర్తల మధ్య ఏ చిన్న గొడవ జరిగినా మహిళలు కేసులు పెడతారనీ, తద్వారా కాపురాలు విచ్ఛిన్నం అవుతాయని వ్యాఖ్యానించారు. దీని కారణంగా ఈ 400 విడాకులు 40 వేలు, నాలుగు లక్షలకు చేరుకుంటాయని హెచ్చరించారు. కాబట్టి ఈ బిల్లుపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.

More Telugu News