Guntur: గుంటూరు మిర్చిలో క్యాన్సర్ కారకాలు!

  • కలుషితమవుతున్న భూమి, నిల్వలో లోపాలు
  • మిరపలో జీ1, జీ2, బీ2 అఫ్లాటాక్సిన్స్
  • కృష్ణా జిల్లా రీసెర్చర్ల అధ్యయనంలో వెలుగులోకి

అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న గుంటూరు మిర్చిలో అత్యంత ప్రమాదకర విషపూరితాలు, క్యాన్సర్ కారక అఫ్లాటోక్సిన్స్ ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మిరప శాంపిల్స్ ను సేకరించి జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యుటిక్స్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాలను బట్టి, భూమి కలుషితం కావడం, మిర్చి నిల్వలో లోపాల కారణంగానే క్యాన్సర్ కారకాలు వచ్చి చేరుతున్నాయని రీసెర్చర్లు తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల్లో మిరపను నిల్వ ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీ, విజయవాడలోని రెండు పీజీ కాలేజీలకు చెందిన రీసెర్చర్లు వివిధ ప్రాంతాలు, చిన్న చిన్న షాపులు, ఇళ్లు, మిర్చి యార్డు తదితరాల నుంచి మిరప నమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు. ఏడు శాంపిల్స్ లో ఐదింట జీ1, జీ2, బీ2 అఫ్లాటాక్సిన్స్ చాలా అధిక మోతాదులో ఉన్నాయని రీసెర్చర్ల టీమ్ లో భాగంగా ఉన్న ఓ శైలజ, జీ కృష్ణవేణి, ఎం మనోరంజని తెలిపారు.

ఈ అఫ్లాటాక్సిన్స్ క్యాన్సర్ కారకాలని, ఇవి ఏ మేరకు ఆహార పదార్ధాల్లో ఉండవచ్చన్న విషయమై ఎటువంటి నిబంధనలూ లేవని శైలజ వెల్లడించారు. కాగా, గుంటూరు జిల్లాలో ఏటా సుమారు 2.80 లక్షల టన్నుల మిరప పంట చేతికి వస్తుండగా, యూఎస్, యూకే సహా మధ్యప్రాచ్య దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News