Andhra Pradesh: ఆయేషా మీరా హత్య కేసు.. ముగ్గురు కోర్టు ఉద్యోగులపై సీబీఐ కొరడా!

  • విజయవాడ కోర్టు ఉద్యోగులపై కేసు
  • ఆయేషా తల్లిదండ్రులను విచారించనున్న సీబీఐ
  • 2007, డిసెంబర్ 27న ఆయేషాపై అత్యాచారం, హత్య

ఆయేషా మీరా హత్యాచారం కేసు విచారణను సీబీఐ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో భద్రపరిచిన సాక్ష్యాల ధ్వంసం వ్యవహారంలో విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ముగ్గురు ఉద్యోగులు కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు, దోషులను రక్షించేందుకు యత్నించారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు గత నెలలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ కేసు విచారణలో పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు నమోదుచేసిన సీబీఐ.. త్వరలోనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యంబాబు (ఆయేషా హత్యకేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు)ను విచారించనుంది.

2007, డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటున్న ఆయేషా మీరాపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేశారు. ఈ కేసులో సత్యంబాబును విజయవాడలోని మహిళా కోర్టు దోషిగా తేల్చగా, గతేడాది హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.

More Telugu News