Police: పోలీస్ నంటూ 12 ఏళ్లు నమ్మించిన ప్రబుద్ధుడు.. చిన్న కారణంతో దొరికిపోయిన వైనం!

  • చైనాలోని జిజియాంగ్ ప్రావిన్సులో ఘటన
  • పోలీస్ వేషంతో నచ్చిన యువతితో వివాహం
  • అందరినీ నమ్మించిన చైనా యువకుడు

టెంపర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోలీస్ కావాలని కలలు కంటాడు. కేవలం అక్కడితో ఆగకుండా డిగ్రీ సర్టిఫికెట్లు కొనేసి ఏకంగా పోలీస్ అయిపోతాడు. అచ్చం అదే రీతిలో కాకపోయినా చైనాలో ఓ వ్యక్తి మాత్రం అసలు ట్రైనింగ్ తీసుకోకుండానే పోలీస్ అవతారం ఎత్తాడు. పుస్తకాలు, నవలలు చదివి పోలీసులు రిపోర్టులు ఎలా రాస్తారో తెలుసుకున్నాడు. అక్కడితో ఆగకుండా నచ్చిన యువతిని సైతం వివాహం చేసుకున్నాడు. అయితే ఇష్టానుసారం అప్పులు చేయడంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన చైనాలోని జిజియాంగ్ ప్రావిన్సులో చోటుచేసుకుంది.

బైబూ పట్టణానికి చెందిన వాంగ్‌ఫెంగ్‌ (41)కు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని మహా కోరిక. అయితే చదువు అబ్బకపోవడంతో అది తీరని కలగానే మిగిలిపోయింది. అయితే 2006లో ఇతని సోదరుడు ఓ పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు. దీంతో ఎప్పుడో తాను కొనుక్కున్న పోలీస్ దుస్తుల్ని ధరించి అక్కడకు వెళ్లిన వాంగ్ సోదరుడిని విడిపించుకోగలిగాడు. ఇదేదో బాగుందని భావించిన వాంగ్.. నకిలీ ఐడీ కార్డును తయారుచేసుకుని పోలీస్ గా చలామణి కావడం ప్రారంభించాడు. అంతేకాదు.. నవలలు, పాత రికార్డులు చూసి నివేదికలు రాయడం నేర్చుకున్నాడు. ఇలా తాను నిజంగానే పోలీస్ అని చుట్టుపక్కల అందరినీ నమ్మించాడు.

ఈ క్రమంలోనే తాను మనసు పడ్డ యువతి జియావోను 2011లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం సమయంలో తాను జియాక్సింగ్‌ క్రిమినల్‌ దర్యాప్తు విభాగంలో పనిచేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో భార్య బంధువులు ఇద్దరు ఓ కేసులో ఇరుక్కోవడంతో వాంగ్ సాయాన్ని అర్ధించారు. అయినా వారిద్దరు చేసింది చిన్న తప్పే కావడంతో తక్కువ శిక్ష పడింది. అయితే తన పలుకుబడి కారణంగానే వాళ్లిద్దరికీ తక్కువ శిక్షలు పడ్డాయని వాంగ్ కలరింగ్ ఇచ్చాడు. పైకి పోలీసుగా ఫోజులు ఇచ్చినప్పటికీ వాంగ్ బతకడానికి ప్రింటింగ్ వ్యాపారం చేసేవాడు. అంతేకాకుండా హోటల్స్ లో పనిచేసేవాడు. ప్రింటింగ్ వ్యాపారం సందర్భంగా తాను పోలీసునని చెప్పి భారీగా అప్పులు తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో అతని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో వాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు అతను నిజమైన పోలీస్ కాదని తెలుసుకుని విస్తుపోయారు. ఏకంగా ప్రావిన్సు పోలీస్ విభాగాన్ని 12 ఏళ్లు పాటు మోసం చేశాడని తెలుసుకుని నోరెళ్లబెట్టారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News