APPSC: ఏపీలో కొలువుల జాతర.. నిరుద్యోగులకు శుభవార్త!

  • పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • ఈ నెల 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • మహిళా శిశు సంక్షేమ శాఖలో 109 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వెయ్యి పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించగా, గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు 51 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులను ఇప్పుడు భర్తీ చేయనున్నారు. వీటితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ప్రాథమిక పరీక్షను ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. ఆగస్టు 2న ఆన్‌లైన్‌లో ప్రధాన పరీక్ష ఉంటుంది.  


మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్‌లో గ్రేడ్-1 పోస్టుల పోస్టులు మొత్తం 109 కాగా, ఈ నెల 28 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ప్రధాన పరీక్ష మాత్రం ఏప్రిల్ 25న నిర్వహిస్తారు. పంచాయతీ సెక్రటరీ పోస్టులను జిల్లాల వారీగా చూసుకుంటే.. శ్రీకాకుళంలో 114, విజయనగరంలో 120, కర్నూలులో 90, విశాఖపట్టణంలో 107, తూర్పుగోదావరి జిల్లాలో 104, పశ్చిమగోదావరి జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 22, గుంటూరులో 50, ప్రకాశంలో 172, నెల్లూరులో 63, చిత్తూరులో 141, అనంతపురంలో 41, కడపలో 2 (క్యారీ ఫార్వర్డ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

More Telugu News