Telangana: తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్సీల భేటీ!

  • మండలి విభాగాన్ని విలీనం చేయడంపై చర్చ
  • రెండుకు పడిపోనున్న కాంగ్రెస్ బలం
  • 2019లో తుడిచిపెట్టుకుపోనున్న కాంగ్రెస్

తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేందుకు టీఆర్ఎస్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన నలుగురు ఎమ్మెల్సీలు.. పార్టీ మండలి విభాగాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈరోజు మండలి చైర్మన్ స్వామిగౌడ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్ భేటీ అయ్యారు.

కాగా, ప్రభాకర్, దామోదర్ రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ మాత్రం నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతిభవన్ లో సమావేశమై తమ రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. అన్నిరకాలుగా ఆదుకుంటామనీ, అండగా ఉంటామని కేసీఆర్ హమీ ఇవ్వడంతో ఆకుల లలిత, సంతోష్ కుమార్ త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మండలిలో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే మిగలనున్నారు. వీరి పదవీకాలం కూడా 2019, మార్చి నెలతో ముగియనుంది.

More Telugu News