Hyderabad: ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

  • సాయంత్రం 5 నుంచి 10 గంటల మధ్య వాహనాల మళ్లింపు
  • పలు చోట్ల వాహనాల నిలిపివేత
  • మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి రాక సందర్భంగానూ వాహనాల నిలిపివేత

హైదరాబాద్‌ మహానగరంలో నేడు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) తెలిపారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల నుంచి వాహనాలను మళ్లిస్తారు, మరికొన్ని చోట్ల నిలిపివేయనున్నారు. ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ కూడలి నుంచి బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తారు. 

ఆబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్‌ విగ్రహం వైపు రానివ్వరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి మీదుగా చాపెల్‌ రోడ్డు వైపు పంపిస్తారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ నుంచి లిబర్టీ వైపు తిప్పి పంపిస్తారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు వేర్వేరు ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

అలాగే ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మధ్యాహ్నం 1.40 గంటలకు  బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పంజాగుట్ట ప్లైఓవర్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మీదుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

More Telugu News