Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటు.. చేతులు కలిపిన అఖిలేష్‌, మాయావతి?

  • ఆర్‌ఎల్‌డీని కలుపుకొని సీట్ల సర్దుబాటు కూడా చేసుకున్నట్లు సమాచారం
  • ఆర్‌ఎల్‌డీకి మూడు,  బీఎస్సీ 38, ఎస్పీ 37 స్థానాల్లో పోటీకి నిర్ణయం
  • మాయావతి పుట్టిన రోజు జనవరి 15న వివరాలు వెల్లడించే అవకాశం

బీజేపీయేతర పక్షాలతో మహాకూటమి ఏర్పాటుకు ఓవైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలోనే దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో కొత్తకూటమి ఏర్పాటైనట్లు వార్తలు వస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు బలమైన రాజకీయ శక్తులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు ఆర్‌ఎల్‌డీతో కలిసి ఈ కూటమి ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్రం నుంచి ప్రచురితమవుతున్న హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ వెల్లడించింది.

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపైనా ఈ మూడు పార్టీలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది. అజిత్‌సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ)కి మూడు స్థానాలు కేటాయించాలని, మిగిలిన వాటిలో 37 స్థానాల్లో ఎస్పీ, 38 స్థానాల్లో బీఎస్సీ పోటీ చేయాలని పంపకాలు చేసుకున్నాయట. మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని మూడు పార్టీల నాయకులు నిర్ణయించినట్లు ఆ పత్రిక పేర్కొంది.

మొత్తం 80 స్థానాలకుగాను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథి నియోజకవర్గాలను మాత్రం పక్కన పెట్టినట్లు సమాచారం. యూపీలో కాంగ్రెస్‌కు బదులు కొన్ని చిన్న పార్టీలకు సీట్లు కేటాయించాలని ఎస్పీ, బీఎస్సీ  అధినేతలు అఖిలేష్, మాయావతి నిర్ణయించినట్లు సదరు పత్రిక తన కథనంలో తెలిపింది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలకు ఆదిలోనే అడ్డంకులు ఏర్పడినట్టే.

More Telugu News