Andhra Pradesh: అలిగి ఆర్టీసీ బస్సు ఎక్కిన చింతమనేని.. ఆయన కారును తీసుకెళ్లేది ఎవరు?

  • టోల్ ప్లాజా వద్ద కారును వదిలేసిన చింతమనేని
  • ఫీజు కట్టాలని సిబ్బంది చెప్పడంపై ఆగ్రహం
  • పూర్తి భిన్నమైన వాదనను వినిపిస్తున్న టోల్ సిబ్బంది

టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేకు మినహాయింపు ఉంటుందని చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. మనస్తాపంతో పక్కనే వచ్చిన ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం చింతమనేని తన ఇద్దరు గన్ మెన్లతో కలిసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను ఎమ్మెల్యేను అని చెప్పినా టోల్ సిబ్బంది వినిపించుకోలేదని చింతమనేని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు ప్లాజా సిబ్బందిపై కేసు నమోదుచేశారు. మరోవైపు చింతమనేని వదిలివెళ్లిన కారును ఎవరు తీసుకెళ్లాలన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కారును పోలీస్ అధికారులు తీసుకెళ్లాలా? లేక టోల్ ప్లాజా సిబ్బంది స్వాధీనంలో ఉంచాలా? అన్న విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కాగా, చింతమనేని కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ లేకపోవడంతోనే తాము అడ్డుకున్నామని కాజా టోల్ ప్లాజా సిబ్బంది ప్రకటించారు. ముఖం కనిపించకుండా చింతమనేని మఫ్లర్ చుట్టుకున్నారనీ, అందువల్లే గుర్తించలేకపోయామని వివరణ ఇచ్చారు. చింతమనేని ముఖానికి ఉన్న ముసుగు తీయగానే వెంటనే గేటు ఎత్తి వెళ్లాల్సిందిగా ఆయన్ను కోరామని స్పష్టం చేశారు. తమను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని వాపోయారు.

More Telugu News