Chandrababu: చెన్నైలో తమిళంలో ప్రసంగించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

  • కేంద్రం వైఖరితో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు
  • రాఫెల్ కేసులో సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు
  • ఈవీఎంల ట్యాంపరింగ్ రూపంలో సరికొత్త ముప్పు వచ్చింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పినరయి విజయన్, రజనీకాంత్ లతో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి సభికులను ఉల్లాసపరిచారు. అనంతరం ఇంగ్లీషులో మాట్లాడుతూ, దేశంలోని అన్ని వ్యవస్థలు మోదీ పాలనలో నిర్వీర్యం అయ్యాయని... ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆటలు తమిళనాడులో సాగలేదని... తమిళనాడు స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఆర్బీఐ గవర్నర్ కూడా రాజీనామా చేశారని చంద్రబాబు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో డీఎంకేని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈవీఎంల ట్యాపరింగ్ రూపంలో దేశానికి సరికొత్త ముప్పు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిని నిరోధించే అంశంలో అత్యంత కీలకమైన సీబీఐని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని... చివరకు సీబీఐ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. విపక్ష నేతలను బలహీనపరిచేందుకు ఈడీ, ఐటీలను వాడుకుంటున్నారని చెప్పారు. రాఫెల్ కేసులో సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు అఫిడవిట్ ను ఇచ్చారని దుయ్యబట్టారు. గోవా, నాగాలాండ్, తమిళనాడులతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News