India: అతివల మృతదేహాలను చుట్ట చుట్టి తెస్తుంటే చూడలేము: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

  • సైన్యంలో ముందుండి యుద్ధం చేసే బాధ్యతలు అప్పగించబోము
  • ఆయుధాల నిర్వహణను అద్భుతంగా చేస్తున్నారు
  • పోరాడించేందుకు మాత్రం వ్యతిరేకినేనన్న రావత్

అతివల మృతదేహాలను చుట్టగా చుట్టి తీసుకు వస్తుంటే చూసేందుకు భారతావని సిద్ధంగా లేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. మైనింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో మహిళా ఉద్యోగుల నియామకాలు కొనసాగుతాయని చెప్పిన ఆయన, యుద్ధంలో ముందు నిలబెట్టి, వారితో పోరాడించేందుకు మాత్రం వ్యతిరేకమని చెప్పారు. "పిల్లలకు తల్లిగా ఉన్న ఓ మహిళ మరణించదని నేను చెప్పను. ఆమె రోడ్డు ప్రమాదంలో అయినా చనిపోవచ్చు. అదే యుద్ధంలో ఆమె మరణించి, మృతదేహాన్ని మూటకట్టి తెస్తుంటే చూసేందుకు దేశం సిద్ధంగా లేదు" అని ఆయన అన్నారు.

సైన్యంలోని మహిళలకు యుద్ధ బాధ్యతలను అప్పగించబోమని, అంతమాత్రాన వారు సమర్ధత లేనివారని తాను చెప్పడం లేదని అన్నారు. ఆయుధాల నిర్వహణను అతివలు అద్భుతంగా చేస్తున్నారని, కశ్మీర్ లో పాకిస్థాన్ తో నిత్యమూ యుద్ధం చేయాల్సిన ఈ పరిస్థితుల్లో మహిళలను ముందు నిలపలేమని అన్నారు. మహిళలకు కమాండింగ్ బాధ్యతలు అప్పగించేందుకు వ్యక్తిగతంగా తాను సిద్ధమేనని, కానీ, సైన్యం మాత్రం సిద్ధంగా లేదని చెప్పారు. ఆర్మీలో పోరాడే మహిళకు మెటర్నిటీ సెలవు ఇవ్వరాదని, తాను ఆ మాటంటే కొత్త వివాదాలు వస్తాయని బిపిన్ రావత్ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News