Phethai: తీవ్ర తుపానుగా మారిన ఫెథాయ్... తాజా అప్ డేట్!

  • తిత్లీని మించి ఆందోళన
  • రేపు తీరం దాటే అవకాశం
  • నేటి సాయంత్రానికి భారీ వర్షాలు మొదలు

నాలుగు రోజుల క్రితం అల్పపీడనం రూపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెథాయ్ తుపాన్, ఇప్పుడు తిత్లీని మించిన ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పెను తుపానుగా మారిన ఫెథాయ్, తీరంవైపు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. రేపు కాకినాడ, మచిలీపట్నం మధ్య ఇది తీరాన్ని దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.

కాగా, తుపానుపై సమీక్ష జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి, ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండలానికో అధికారిని ప్రత్యేకంగా నియమించి సహాయక చర్యలను తక్షణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

తుపాన్ నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. కాగా, కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి, భారీ ఎత్తున అలలు ఎగసి పడుతూ ఉండటంతో పరిసర ప్రాంతాల నివాసితులు భయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 50కి పైగా పునరావాస కేంద్రాలు సిద్ధం అయ్యాయి.

నేటి సాయంత్రం నుంచే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా తుపాను తీరాన్ని దాటే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తెలిపారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశామని, పాపికొండలకు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని వెల్లడించారు.

More Telugu News